కలం, నిర్మల్ : రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీ ఎరువులను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్ లైసెన్సును సస్పెండ్ చేసినట్లు ఆయన సోమవారం వెల్లడించారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.
ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత డీలర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మరో నలుగురు ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తాఖీదులు ఇచ్చినట్లు వెల్లడించారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, నకిలీ విత్తనాల విక్రయం, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు జరపడం వంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.
Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే
Follow Us On: X(Twitter)

