కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవసరమైనంత యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లాలో యూరియా కొరత ఎక్కడా లేదని స్పష్టం చేసిన కలెక్టర్, రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్‌లోనే అత్యధికంగా 27,203 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రైతులకు ఎరువులు సమర్థవంతంగా, సమయానుకూలంగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. అక్రమాలు, పక్కదారి పడకుండా పారదర్శక పంపిణీ కోసం యూరియా బుకింగ్ యాప్ ఉపయోగపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా మండల స్థాయిలో ఏ డీలర్ వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.
సమీప డీలర్ల వద్ద పంట విస్తీర్ణానికి అనుగుణంగా రైతులు యూరియాను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సూచించారు. అన్ని ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద స్టాక్ వివరాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నకిలీ, నాసిరకం ఎరువులు, విత్తనాలపై కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నామని, తహసిల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. ఎరువులు ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేయకుండా, అవసరానికి అనుగుణంగా దశల వారీగా వినియోగించాలని రైతులకు సూచించారు. అలాగే ఎరువుల కొనుగోలుకు సంబంధించి రైతులను ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ (Collector Ila Tripathi) హెచ్చరించారు.
Read Also: బీజేపీకి ఆయుధంగా ‘సర్’: నిరంజన్ రెడ్డి
Follow Us On : WhatsApp

