కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు మొద్దు నిద్ర వీడాలని ఘాటుగా హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఏ సమాచారం అడిగినా తప్పించుకునే ధోరణి సరికాదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని, పని చేయడం చేతకాకపోతే పదవులు విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
సమాచారం కోరితే తప్పుడు వివరాలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. అధికారుల పనితీరులో మార్పు రాకుంటే, వేతనాల నిలుపుదల లాంటి చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును 30 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీఆర్డీఏ, విద్యాశాఖ, వ్యవసాయశాఖ, సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల్లో హాజరు శాతం సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. అటెండెన్స్ సరిగా లేకపోతే ప్రజలకు సేవలు ఎలా అందిస్తారని అధికారులను నిలదీశారు. ప్రతి శాఖకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని కలెక్టర్ హెచ్చరించారు.

