కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పోక్సో కేసులో మహబూబ్‌నగర్ (Mahabubnagar) జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు జైలు నుంచి పారిపోయిన విషయం జిల్లాలో సంచలనం కలిగించింది. జైలు నుంచి పారిపోయిన ఖైదీ స్వగ్రామంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు అయింది. దీంతో అతడు 25 రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి పరారీ కావడానికి కిషోర్ అనేక సార్లు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. తోటి ఖైదీల టవాల్స్ ను తీసుకొని బాత్‌రూం ఎక్కి అక్కడి నుంచి గోడ మీదకు చేరి టవాళ్లను ఒకదానికొకటి కట్టి 18 ఫీట్ల గోడ దాటుకొని కిందికి దిగి పరారీ అయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు.
అనంతరం జైలు అధికారులు వెంటనే స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అటు జైలు సిబ్బంది, పోలీసులు సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు స్వగ్రామానికి చేరుకుని ఉంటాడని ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. జైలు నుంచి పరారైన కిషోర్ తల్లిదండ్రులకు ఫోన్‌కాల్ చేసినట్లు గుర్తించారు. జైలు నుంచి పారిపోయి ఇంటికి వస్తున్నానని సమాచారం ఇవ్వగా తల్లిదండ్రులు వారించారు.
పరారీ విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ గోప్యంగా విచారణ జరిపి వెళ్లినట్లు సమాచారం. అయితే మహబూబ్‌నగర్ జైలు నుంచి ఖైదీ పరారైనట్లు జైలు శాఖ నుంచి తమకు ఫిర్యాదు అందిందని వన్ టౌన్ ఎస్సై శీనయ్య మీడియాకు వివరించారు.
స్వగ్రామంలో ఆత్మహత్య యత్నం
జైళ్లు నుంచి పారిపోయిన ఖైదీ అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చేరుకుని, అక్కడ నానో యూరియా పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

