కలం, నిర్మల్ : ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదివారం కుంటాల, ముధోల్ మండలాల్లో పరిశీలించారు. ముందుగా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన డిజిటలైజేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముధోల్ మండలంలోని తరోడ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ఆన్ లైన్ జరుగుతున్న తీరును, రికార్డుల నమోదు ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. బిఎల్ఓ యాప్ లో వివరాలను తనిఖీ చేశారు. గడువులోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ లు కమల్ సింగ్, శ్రీలత, తరోడా సర్పంచ్ అరిఫుద్దీన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

