Mobile Popup Ad
Mobile Popup Ad

ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

కలం, నిర్మల్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను సమగ్రంగా వివరించారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారంలు ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కూడా సమర్పించవచ్చన్నారు.

వివరాల పరిశీలన తర్వాత, ఎస్ఐఆర్ కి సంబంధించి, జూలై 31వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ (Bhavesh Mishra) చెప్పారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫామ్ లను నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్) తో ఈఆర్ఓ లను సంప్రదించవచ్చునని చెప్పారు. ఫాం 6, 7, 8 ల గురించి వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరుపున బూత్ లెవెల్ ఏజెంట్ (బిఎల్ఎ) లను నియమించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు.

ఎప్పటికప్పుడు బిఎల్ఓ లు, బిఎల్ఎ ల తో సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఎస్ఐఆర్ నిర్వహణలో బిఎల్ఎ లు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓలు దేవీదాస్, మోహన్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>