కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ సోయిలేని పాలకులతో తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం దాపురించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి (Niranjan Reddy) నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటాలు, ఎంతోమంది అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కలలు కన్నా బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం
గతంలో మాదిరిగా వనపర్తి నియోజకవర్గంలో భారీగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సాకులు చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అలసత్వం చేయొద్దని సూచించారు. పార్టీ పట్ల విధేయత చిత్తశుద్ధి, అంకితభావం, నాయకుల పట్ల విశ్వాసం ఉన్న కార్యకర్తలకే పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
ప్రజా సమస్యలపై స్పందించండి
ప్రజా సమస్యలపై స్పందించే నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఉంటారని, అలాంటి నాయకత్వమే తాము కోరుకుంటున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. గతంలో అభివృద్ధి చేసినప్పటికీ దుష్ప్రచారం వల్లే ఓటమి చెందామన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ఆయన అన్నారు. కార్యకర్తల క్రమశిక్షణ పార్టీకి శ్రీరామరక్ష అని హామీలు విస్మరించిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో సర్కస్ చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మెట్టు శ్రీనివాస్, జిల్లా నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేశ్ గౌడ్, నందిమల్ల అశోక్, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఎద్దుల కరుణ శ్రీ, కృష్ణా నాయక్, జాతృ నాయక్, రఘుపతి రెడ్డి, బోర్ల భీమన్న, గంధం. బాలపీరు, గంధం పరంజ్యోతి, వెంకట్ సాగర్, మండల, పట్టణ అధ్యక్షులు మాణిక్యం, కృష్ణయ్య, దిలీప్ రెడ్డి, వేణు యాదవ్, బీ బాలరాజు, వెంకట్ స్వామి, పెద్దింటి వెంకటేష్, పృథ్వీ రాజ్, కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్, భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి, ఏర్వ అరుణ శ్రీనివాసులు, స్వాతి హరిబాబు, శంకరమ్మ బాబు నాయక్, సూర్యవంశం గిరి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము తదితరులు ఉన్నారు.

