కలం, కరీంనగర్ బ్యూరో : పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఓ 80 ఏళ్ల వృద్ధురాలి ఇంటిని అక్రమార్కులు కబ్జా చేసిన ఘోరం జగిత్యాల (Jagtial) జిల్లాలో చోటు చేసుకుంది. బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన ముస్సె గంగవ్వ (80) ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జిల్లా కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పెన్షన్ ఇప్పిస్తామని నమ్మించి, తన పెద్ద కుమారుడు రాజేశంతో కుమ్మక్కై అధికార పార్టీ సర్పంచ్ భర్త గట్టు గంగారం 6 గుంటల ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టవిరుద్ధంగా తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్
ఇంటి స్థలం కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ బుగ్గారం తహసీల్దార్ కార్యాలయంలో చట్ట విరుద్ధంగా రిజిస్ట్రేషన్ నిర్వహించారని బాధితురాలు ఆరోపించారు. అనంతరం గట్టు గంగారం ఆ స్థలాన్ని గడ్డం మహేష్‌కు, అతను గణవేణి వెన్నెల (చిన్నాపూర్ )కు విక్రయించినట్లు తెలిపారు.
ఆధారాలున్నా అన్యాయం
జగిత్యాల (Jagtial) సబ్ రిజిస్ట్రార్ ECలో తన కుమారులు రాజలింగం, లింగం పేర్లు ఉన్నాయని, ఇదే స్థలంలో ఉన్న 1-46 నెంబర్ గల ఇంట్లో తాను నివసిస్తూ పంచాయతీకి ప్రతి ఏటా పన్ను చెల్లిస్తున్నానని గంగవ్వ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నా అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిపించడం అనుమానాలకు తావిస్తోందని వాపోయారు.
ప్రహరీ గోడకు అడ్డు..
ఒంటరిగా నివసిస్తున్న తనను రక్షణ కోసం ప్రహరీ గోడ కట్టుకోనివ్వకుండా గణవేణి వెన్నెల, ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని వృద్ధురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ప్రహరీ గోడతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తూ చేసుకున్నానని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న గట్టు గంగారాం, గడ్డం మహేష్, గణవేణి వెన్నెల పై చట్ట రీత్యా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గంగవ్వ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

