కలం, వనపర్తి: కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎగువ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఖిలా ఘణపురం మండలంలోని కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో సమృద్ధిగా నీరు ఉన్నందున వెంటనే పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూ.76.16 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామని, ఘణపురం బ్రాంచ్ కెనాల్, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ మధ్య ఎత్తైన ప్రాంతాల్లోని సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఆరు గ్రామాలు, తొమ్మిది గిరిజన తండాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 2022 మార్చి 8న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నె తండా లిఫ్ట్‌కు శంకుస్థాపన చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు శరవేగంగా జరిగి దాదాపు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
మిగిలిన పనులను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు సమయం తీసుకుందని విమర్శించారు. కేవలం సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఇంతకాలం కాలయాపన చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సబ్‌స్టేషన్ కోసం రూ.2 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. రైతుల ఒత్తిడితో వెట్‌రన్ నిర్వహించి అనంతరం పంపులను నిలిపివేశారని నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కృష్ణా వరదల కారణంగా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉన్నందున ఆలస్యం చేయకుండా లిఫ్ట్ పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లో పంపులను ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కర్నె తండా లిఫ్ట్‌ను ముట్టడించి పంపులు ప్రారంభించే వరకు ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నె తండా లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసే విధానాన్ని ఆయన వివరించారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్ 7.3 కిలోమీటర్ల వద్ద ఉన్న ముందరి తండా మైసమ్మ చెరువును నింపి, అక్కడి నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా పంప్‌హౌస్‌కు నీటిని మళ్లిస్తామని తెలిపారు.
లిఫ్ట్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని డెలివరీ సిస్టర్న్ వరకు మొత్తం 58 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేసేందుకు 800 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎత్తైన ప్రాంతాల్లో సాగునీటికి నోచుకోని భూములకు కృష్ణా జలాలను అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాలను రూపొందించిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నె తండా లిఫ్ట్ కూడా అందులో భాగమేనని, దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతుల కలను సాకారం చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నందిమల్ల అశోక్, రాళ్ల కృష్ణయ్య, సామ్యానాయక్, జాతృ నాయక్, పీన్యా నాయక్, గోపాల్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

