Mobile Popup Ad
Mobile Popup Ad

నెయ్మర్, రోబిన్హో జూనియర్ మధ్య గొడవ.. ఏం జరిగింది?

కలం, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌లోని ప్రసిద్ధ శాంతోస్ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆదివారం జరిగిన శిక్షణలో పెద్ద గొడవ చోటుచేసుకుంది. సీనియర్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ (Neymar), 18 ఏళ్ల యువ ఆటగాడు రోబిన్హో జూనియర్ మధ్య జరిగిన ఈ ఘర్షణపై క్లబ్ యాజమాన్యం అధికారికంగా అంతర్గత విచారణ ప్రారంభించింది. శిక్షణ సమయంలో జరిగిన ఒక డ్రిల్ లో భాగంగా, రోబిన్హో జూనియర్ బంతిని నెయ్మర్ కంటే వేగంగా తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇది నెయ్మర్‌కు నచ్చలేదని, తనను అవమానించినట్లు భావించిన ఆయన వెంటనే స్పందించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నెయ్మర్ ఆ యువ ఆటగాడిని కింద పడేయడంతో గొడవ మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది.

తీవ్ర ఆరోపణలు చేసిన రోబిన్హో జూనియర్

ఈ ఘటనపై రోబిన్హో జూనియర్ స్పందిస్తూ నెయ్మర్ తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. నెయ్మర్ తనను కింద పడేయడమే కాకుండా, ముఖంపై గట్టిగా కొట్టారని ఆయన క్లబ్‌కు ఫిర్యాదు చేశారు. శిక్షణ ఇచ్చే చోట తనకు కనీస భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ క్లబ్ బోర్డుతో సమావేశానికి మొగ్గు చూపారు.

ఈ ఘటనపై నెయ్మర్ ప్రతినిధులు నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, జరిగిన దానిపై నెయ్మర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని సమాచారం. గొడవ తర్వాత ఆయన రోబిన్హో జూనియర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ వివాదం ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారంపై శాంతోస్ ఫుట్‌బాల్ క్లబ్ స్పందిస్తూ.. ఒక ఆటగాడిపై మరో ఆటగాడు దాడి చేయడం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. వెంటనే క్రమశిక్షణా చర్యలు మొదలుపెట్టామని, రే పెలే ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు బోర్డు ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>