కలం, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్ 2026లో (FIFA World Cup 2026) బ్రెజిల్ జట్టుకు భారీ ఊరట లభించింది. స్టార్ ఫార్వర్డ్ నెయ్మర్ (Neymar) మళ్లీ శిక్షణలో పాల్గొనడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టోర్నీ ప్రారంభానికి ముందే నెయ్మర్ ఎంపికపై పెద్ద చర్చ జరిగింది. 2023 తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడని అతడిని కోచ్ కార్లో అంచెలోట్టి తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే నెయ్మర్ కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతూ ఉండటంతో మొరాకోతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను నాకౌట్ దశ వరకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి మారింది. నెయ్మర్ తిరిగి జట్టుతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. శిక్షణ సమయంలో అతను ఉత్సాహంగా కనిపించగా, సహచర ఆటగాళ్లు, సిబ్బంది అతనికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో హైతీతో జరిగే మ్యాచ్‌లో నెయ్మర్ బరిలోకి దిగే అవకాశాలు పెరిగాయి. అయితే గాయం నుంచి ఇటీవలే కోలుకున్నందున అతడిని తొలి జట్టులో కాకుండా ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన నెయ్మర్‌పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రెజిల్ (Brazil) జట్టు తొలి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సమయంలో, నెయ్మర్ రాక జట్టుకు మరింత బలంగా మారనుంది.

