కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టి పురోగతిలో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతు పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పంచాయతీ రాజ్, విద్య, మౌలిక వసతుల ఇంజినీరింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 13 కళాశాలల సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతు పనుల పురోగతిని కళాశాలల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉండటాన్ని గుర్తించి వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల సమస్యలు ఉంటే వారి స్థానంలో కొత్త వారిని నియమించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల పురోగతిపై రోజూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
అడ్మిషన్ల పురోగతిపై ఆరా..
జిల్లాలోని కళాశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షించారు. ప్రవేశం కోసం వచ్చిన ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 4,838 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు మొదటి సంవత్సరంలో 2,866 మంది ప్రవేశాలు పొందినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కలెక్టర్‌కు వివరించారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు, అవకాశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రమణి తదితరులు పాల్గొన్నారు.

