Traffic Challan Rules | వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఇకపై యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రూల్స్‌ను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. చలాన్ల చెల్లింపు విషయంలో కూడా కీలక సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఇకపై చలాన్లను ఎవరైనా 45 రోజుల లోపే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాహనంపై ఐదుకు మించి చలాన్లు ఉండకూడదు. ఈ నిబంధలను పాటించకపోతే లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సవరణలను కేంద్ర రవాణాశాఖ ప్రతిపాదించింది. భారీ మొత్తంలో చలాన్లు పెండింగ్‌లో ఉంటున్న క్రమంలోనే ఈ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని కేంద్ర రవాణా శాఖ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలక్ట్రానిక్ రూపంలో అధికారులు మూడురోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల్లోగా ఫిజికల్ రూపంలో నోటీసు అందించాలని స్పష్టం చేసింది.
కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదాపై అభ్యంతరాలు సూచనలను ఉంటే ఢిల్లీ రహదారిలోని రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా comments-morth@gov.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చని తెలిపింది.
కొత్త రూల్స్(Traffic Challan Rules) ఇవే..
ప్రస్తుతం చలాన్లు.. వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. కొత్త రూల్ ప్రకారం.. చలాన్ వేసిన సమయంలో యజమాని డ్రైవింగ్ చేయడం లేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతాడు.
చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోయినా, అధిక మొత్తంలో చలాన్లు పెండింగ్‌లో ఉన్నా సదరు వాహనంపై ఎటువంటి లావాదేవీలను రవాణాశాఖ అనుమతించదు. దీంతో వాహనం అమ్మకం, కొనుగోలు వంటివే కాకుండా లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతో పాటు రెన్యూవల్ కూడా జరగదు.
ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న చలాన్ చెల్లింపు కాల పరిమితి కొత్త నిబంధన ప్రకారం 45 రోజులకు కుదించబడింది. చలాన్ కట్టని పక్షంలో సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
ఎంవీ(మోటారు వెహికిల్) యాక్టు ప్రకారం.. ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్ చేసే అధికారం ఉంది. అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతాయి.

