Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్​ లో నేపాలీ ముఠా మరో భారీ చోరీ..

కలం, వెబ్​ డెస్క్ : హైదరాబాద్‌ నగరంలో నేపాలీ గ్యాంగ్‌ (Nepali Theft Gang) మరో భారీ చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన భార్యాభర్తలపై ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం, నెల రోజుల క్రితమే ఆ దంపతులను ఇంటి పనుల కోసం నియమించుకున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబైకి వెళ్లారు. ఆదివారం తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు కనిపించకపోవడంతో మొదట వారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయి ఉంటారని భావించారు.

అయితే, ఇంట్లోని పూజా గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. అనంతరం ఇంట్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించగా మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తించారు. మొత్తం సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధిత వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో ఎలాంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో ఇంట్లో పనిచేసిన దంపతుల ప్రమేయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్య కేసులో నేపాలీ నిందితులను అరెస్ట్ చేసేందుకు సిట్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన పునరావృతం కావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>