కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం క్రాస్ రోడ్డు సమీపంలో అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నందనవనం” పార్కు (Nandanavanam Park) ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. పాల్వంచ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ లంగ్ స్పేస్‌లో భాగంగా ఈ పార్కును ఏర్పాటు చేసింది. అంటే పట్టణాలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని స్వీకరించే లక్ష్యంతో పాటు అటు కొత్తగూడెం, ఇటు పాల్వంచ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం ఏర్పాటు చేసిన ఈ నందనవనం పార్కు ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ పార్కులో సహజసిద్ధమైన అటవీ వాతావరణం, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్స్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలను ఏర్పాటు చేశారు. పార్కు లోపల నెమళ్లు రకరకాల అడవి పక్షులకు ఆవాసంగా ఉండేలా దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. ఇంత భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినప్పటికీ, ప్రచార లోపం కారణంగా కనీస సమాచారం పర్యాటకులకు చేరడం లేదు.
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ఇంత దగ్గరలో ఉన్నా, చాలామంది స్థానికులకు కూడా ఈ పార్కు ఉనికి గురించి తెలియకపోవడం గమనార్హం. ప్రధాన రహదారులపై కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. నేటి సోషల్ మీడియా యుగంలో ఏదైనా ప్రాంతం ప్రాచుర్యం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అటవీ శాఖ తరఫున ఈ పార్కు అందాలను వివరించే చిన్న ప్రయత్నం కూడా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా అధికారిక వెబ్‌సైట్లలో, సోషల్ మీడియా వేదికల ద్వారా నందనవనం అందాలను పర్యాటకులకు వివరించాలి. అలాగే పాల్వంచ – భద్రాచలం ప్రధాన రహదారిపై, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పార్కుకు సంబంధించిన దిశానిర్దేశక బోర్డులను ఏర్పాటు చేయాలి. వీటితో పాటు స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ‘నేచర్ క్యాంప్’ పేరుతో ఇక్కడికి ఆహ్వానిస్తే, పిల్లలకు ప్రకృతిపై అవగాహన పెరగడంతో పాటు పార్కుకు ఆదరణ పెరుగుతుందనీ స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి, సరైన ప్రచార ఆర్భాటం కల్పిస్తే.. నందనవనం పార్కు పర్యాటకుల సందడితో కళకళలాడడంతో పాటు ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు, పాల్వంచ కొత్తగూడెం పట్టణ ప్రజలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

