Mobile Popup Ad
Mobile Popup Ad

‘నోరు అదుపులో పెట్టుకో’.. కేటీఆర్‌కి మంత్రి అడ్లూరి వార్నింగ్

కలం, కరీంనగర్ బ్యూరో : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని , లేదంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) హెచ్చరించారు. కరీంనగర్ లో పీఎంజే జువెల్లరీ షాప్ లో ఆదివారం జరిగిన ఘటనలో గాయపడ్డ బాధితులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం కరీంనగర్ లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మంత్రి (Minister Adluri Laxman Kumar) మాట్లాడారు.. కరీంనగర్ జువెల్లరీ షాప్ లో జరిగిన దొంగతనం కాల్పుల ఘటన దురదృష్టకరమన్నారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. కరీంనగర్ దొంగతనం కేసులో నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్నారు. బాధితుల పరామర్శ పేరుతో కరీంనగర్ కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు.

అంతర్రాష్ట్ర దొంగలకు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రితో పరిచయం ఉందని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అడ్లూరి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా అని అడ్లూరి ప్రశ్నించారు. జువెల్లరీ షాప్ దొంగతనం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు రాలేదని కేటీఆర్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సంఘటన జరిగిన రోజు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు తదితరులు పరామర్శించారని మంత్రి గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంథనిలో జరిగిన జంట హత్యల ఘటనలో ఇద్దరు న్యాయవాదులు మరణిస్తే నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి మరణ వాంగ్మూలంలో బీఆర్ఎస్ నాయకులకు తమ హత్యతో సంబంధం ఉందని చెప్పినప్పటికీ నాడు ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు కేటీఆర్ నోరు మెదపలేదన్నారు.

కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మరణిస్తే బాధితులను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు అందించడంలో ముందుంటున్నారని మంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకొని కాళేశ్వరం కేసులో సీబీఐ ద్వారా కేసీఆర్ కు నోటీసులు ఇప్పించాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పారు. సినీ నటుడిగా రాణించి పార్టీ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీ రామారావు కు సైతం ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని దళితులు, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయడానికి ఆ పార్టీ కుట్ర చేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జువెల్లరీ షాప్ నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>