కలం, వెబ్ డెస్క్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB Report) నివేదిక ప్రకారం దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 10,546 మంది రైతులు ఆత్మహత్య (Farmers Suicide) చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం సగటున రోజుకు 29 మంది, అంటే ప్రతి గంటకు ఒక రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 3,824 ఆత్మహత్యలతో మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక (2,971), మధ్యప్రదేశ్ (835) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 780 రైతు ఆత్మహత్యలతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు తమిళనాడులో 503, ఛత్తీస్‌గఢ్‌లో 486 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.
డబుల్ ఇంజన్ సర్కార్ల వైఫల్యం
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అత్యధికం ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాలు (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలన) ఉన్నవే కావడం గమనార్హం. కర్ణాటక, తమిళనాడు మినహా మిగిలిన ప్రధాన రాష్ట్రాలన్నీ ఈ కోవకే చెందుతాయి. డబుల్ ఇంజన్ సర్కార్ల వల్ల ప్రయోజనం కేవలం రాజకీయ నాయకులకే తప్ప, సామాన్య ప్రజలకు, రైతులకు కనీస భరోసా కలగడం లేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అధికారంలో ఎవరున్నా అన్నదాతల ఆత్మఘోష ఆగకపోవడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది. రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న పాలకుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని రైతులు వేడుకుంటున్నారు.

