కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ వేసిన హనీట్రాప్ (Honey Trap)లో పడిన నేవీ ఉద్యోగి శత్రు దేశానికి కీలక సమాచారం అందించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రదీప్ ముఖర్జీ (31) విశాఖపట్నంలోని నావల్ కమాండ్‌లో నేవీ సైలర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రానిలో మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నారు. కొన్ని నెలల కిందట ప్రదీప్ ముఖర్జీకి పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌గా భావిస్తున్న మహిళ.. హనీ ట్రాప్ వేసింది. ఆమె మాయలో చిక్కుకున్న ప్రదీప్ ముఖర్జీ.. విశాఖ నావల్ కమాండ్‌కి సంబంధించిన సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. నేవీ స్థావరాలు, నౌకల కదలికలు, సిబ్బంది కార్యకలాపాలకు సమాచారాన్ని రహస్యంగా ఆమెకు పంపించినట్లు చర్చ జరుగుతోంది.
ఏపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్..
ప్రదీప్ ముఖర్జీ నేవీ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయన సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఆయన్ను కోయంబత్తూరులో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. భారత సైన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ అందమైన మహిళల ద్వారా అధికారులు, సిబ్బందికి హనీ ట్రాప్ వేస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పదుల సంఖ్యలో ఏజెంట్లను ఆర్మీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

