కలం, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువల పనులతో పాటు అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్, ఉదయ సముద్రం తదితర ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించారు. నిధుల కొరత లేకుండా చూస్తూ, పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
భూసేకరణ వేగవంతం చేసి నిధులు విడుదల చేయాలి: వేముల వీరేశం
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా పెండింగ్‌లో ఉన్న కాలువల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని మంత్రిని కోరారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికీ సాగునీరు అంది, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వేముల తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

