కలం, జోగులాంబ గద్వాల: ప్రజా పాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishna Mohan Reddy) అన్నారు. బుధవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధరూర్ (Dharur) మండలానికి కొత్తగా మంజూరైన 720 చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను (New Pensions) లబ్ధిదారులకు అందజేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
గద్వాల నియోజకవర్గంలో 5 వేలకుపైగా కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా రైతులకు రెండు పంటలకు నీరందించామని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ధరూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు డి.ఆర్. విజయ్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

