కలం, స్పోర్ట్స్: అండర్-19 ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు చేసుకున్న సంబరాలపై 1983 ప్రపంచకప్ విజేత మదన్ లాల్ (Madan Lal) తాజాగా స్పందించారు. కుర్రాళ్ల ఆటతీరు అద్భుతంగా ఉందని కొనియాడుతూనే, సంబరాల విషయంలో కాస్త సంయమనం పాటించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అల్ అమెరత్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను భారత్ ఒక వికెట్ తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
కానీ, గెలుపు తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్ల ఎదుటే భారత కుర్రాళ్లు అతిగా సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మదన్ లాల్ మాట్లాడారు. భారత యువ ఆటగాళ్లు అద్భుతమైన క్రికెట్ ఆడారని, భారత క్రికెట్ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందని ఆయన అన్నారు. అయితే, మ్యాచ్ ముగిశాక వారు చేసుకున్న సంబరాలు కాస్త శృతి మించాయని పేర్కొన్నారు. పెద్ద జట్టుకు, చిన్న జట్టుకు ప్రవర్తనలో తేడా ఉంటుందని కుర్రాళ్లు అర్థం చేసుకోవాలని సూచించారు. గెలవడం ఎంత ముఖ్యమో, హుందాగా ఉంటూ ప్రత్యర్థి జట్టుకు గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

