ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీజేపీ పోరుబాట

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో వరి కోతలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంట కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం తిమ్మాపూర్ (Thimmapur) మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిని మల్లేశం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికీ రైస్ మిల్లులను కేటాయించకపోవడం, ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం చూస్తుంటే అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించాల్సిన అధికారులు మిల్లుల కేటాయింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతుల నిస్సహాయతను దళారులు ఆసరాగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు మా ఊరపు సంపత్ కుమార్, బూట్ల శ్రీనివాస్, రామ్ హనుమాన్ నగర్ సర్పంచ్ పిసికా సౌజన్య కృష్ణ కిషోర్, అందే శేఖర్, గొట్టిముక్కల తిరుపతిరెడ్డి, గడ్డం అరుణ్, ఎర్రోజు లక్ష్మణ్, కొయ్యడ శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, ఓంకార్ యాదవ్, సుద్దాల సతీష్, ఎలకపల్లి స్వామి, కందుకూరి ఈశ్వర చారి, బుడిగ నరేష్, పాశం సంపత్, తొర్తి సంతోష్, వేల్పుల నరేష్, ప్రశాంత్, వినయ్, చింతల సంపత్ రెడ్డి, బూరుగు శ్రీనివాసరెడ్డి, కామెర వెంకటేష్, సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>