Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డిలో నవోదయకు బ్రేక్.. విద్యార్థుల భవిష్యత్తు సందిగ్ధం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో నవోదయ విద్యాలయం (Navodaya School) ఏర్పాటు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. రెండున్నరేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాలేదు. 2024 డిసెంబర్ 6న తెలంగాణలోని ఏడు జిల్లాలకు కొత్తగా నవోదయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. కేంద్ర విద్యాశాఖ అధికారులు పలు మార్లు స్థలాలను పరిశీలించినప్పటికీ, భూకేటాయింపు జరగకపోవడం, తాత్కాలిక తరగతుల కోసం ఏర్పాట్లు లేకపోవడంతో విద్యాలయం ప్రారంభం పెండింగ్‌లోనే ఉంది.

స్థల కేటాయింపులో జాప్యం

నవోదయ విద్యాలయం కోసం కనీసం 25 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, జవహర్ నవోదయ విద్యాలయ సమితి పేరుతో బదలాయించాల్సి ఉంటుంది. అనంతరం తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తేనే అడ్మిషన్లకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో  శాశ్వత భవనం నిర్మాణం పూర్తవుతుంది. గత ఏడాది తాత్కాలిక తరగతుల కోసం భవనాలను గుర్తించాలని అధికారులు సూచించినప్పటికీ, ఆందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌లో ప్రారంభించాలనే ప్రయత్నం విఫలమైంది. జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట మండలం బాచేపల్లి, అందోలు-జోగిపేట, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలించారు. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాంతానికీ తుది ఆమోదం లభించలేదు.

 క్రెడిట్ కోసం నేతల పోరు

నవోదయ విద్యాలయం ఏర్పాటులో జాప్యానికి ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్లేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తమ తమ ప్రాంతాలలోనే  విద్యాలయం ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలోనే నవోదయను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయన వాదన. మరోవైపు, ఎంపీ రఘునందన్ రావు పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆమీన్‌పూర్ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ సరిపడా భూమి ఉందని ఆయన చెబుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఈ పోటీ కారణంగా అధికారులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.

 విద్యార్థులపై ప్రభావం

నవోదయ విద్యాలయం ప్రారంభమైతే, మొత్తం సీట్లలో కనీసం 75% గ్రామీణ విద్యార్థులకు కేటాయించే అవకాశం ఉంది. కానీ రాజకీయ వివాదాల కారణంగా గత రెండేళ్లుగా అడ్మిషన్లు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా సంగారెడ్డి జిల్లా విద్యార్థులు నాణ్యమైన నవోదయ విద్యకు దూరమవుతున్నారు. మంజూరు అయిన విద్యాసంస్థ ప్రారంభం కాకపోవడం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. నేతల పంతాలు పక్కనబెట్టి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>