కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (Warangal Municipal Corporation) ఎన్నికలపై ప్రధాన పార్టీలు గట్టి ఫోకస్ పెట్టాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా ఆ కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విబేధాలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక పూర్వవైభవం కోసం బీఆర్ఎస్ చెమడోస్తున్నది. అగ్రనేతలను రప్పించుకొని హడావుడి చేస్తోంది. బీజేపీ కూడా ఈ కార్పొరేషన్ పై గురి పెట్టింది. గణనీయమైన స్థానాలు గెలుచుకొని ఉనికి చాటుకోవాలన్నది ఆ పార్టీ ఆరాటం.
జట్టుకట్టిన కాంగ్రెస్ ..
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ (Warangal). మరి కొద్దిరోజుల్లో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, గత ఎన్నికల్లో పట్టు కోల్పోయిన స్థానాలను తిరిగి చేజిక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను, అభివృద్ధి లోటును ప్రచారం చేస్తూ, ప్రజల్లో సానుకూలతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సంక్షేమ పథకాలపై ప్రచారం..
సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తంఓది. అంతర్గత విభేదాలు ఉన్న నేతలంతా తమ విభేదాలు పక్కకు పెట్టి ఒక్కటయ్యారు. ఇటీవల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమైన నేతలు జీడ్ల్యూఎంసీ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల జోరు పెంచారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటు వరంగల్ తూర్పులోనూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేయించిన అనంతరం ఎన్నికలకు వెళతారని ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా గ్రేటర్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు.
గులాబీ పార్టీ వ్యూహమేంటి?
బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంతర్గతంగా అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. నగరంలో తమ ప్రాభవాన్ని నిలుపుకోవడానికి ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో చేసిన అభివృద్ధి పనులనే నమ్ముకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అలాగే తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల ప్రాతిపదికన, స్థానికంగా ఉన్న తమ పట్టును నిలబెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఆ ఇద్దరు నేతల హడావుడి ..
హరీశ్ రావు, కేటీఆర్ ను నగరానికి రప్పించుకుని హడావిడి చేస్తున్నారు. జీడ్ల్యూఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఇటీవలే వరంగల్ వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేశారు. అలాగే సర్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనిలో పనిగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించి రాజకీయ వేడి రగలించారు. జీడ్ల్యూఎంసీపై ఎలాగైనా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.
ఉనికికోసమే కమలం ఆరాటం ..
బీజేపీ వరంగల్‌లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకుంటూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని బలపరచుకుని, ప్రభావవంతమైన స్థానిక నేతలను తమ వైపునకు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది ఇప్పటికే పలువురు రాష్ట్ర నాయకులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. హనుమకొండకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. కాగా ఈ త్రిముఖ పోరులో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందోన్న చర్చ గ్రేటర్ వరంగల్ లో మొదలైంది. మరీ ఓరుగల్లు ఓటర్లు ఎటు మొగ్గుచూపుతారో వేచి చూడాల్సిందే.

