Mobile Popup Ad
Mobile Popup Ad

మే 15న గ్రామీణ సమ్మె.. ఉపాధి కూలీలకు నారీ ఐలయ్య పిలుపు

కలం, నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన ‘విబీజీ రామ్‌జీ’ (VB-G RAM G) చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య (Nari Ailayya) డిమాండ్ చేశారు. ఉపాధి హామీ రక్షణ కోసం మే 15న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను కార్మికులు, సిబ్బంది జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధి హామీ చట్టం కీలక పాత్ర పోషిస్తోందని ఐలయ్య పేర్కొన్నారు. చెరువుల పూడికతీత, కాలువలు, రహదారుల నిర్మాణం, బంజరు భూములను సాగులోకి తీసుకురావడం లాంటి పనుల ద్వారా కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తులను సృష్టిస్తున్నారని కొనియాడారు. పేదల పొట్టగొట్టేలా కొత్త చట్టాలను, జీవోలను తెస్తూ ఉపాధిని దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వాల్సి ఉండగా, కొత్తగా 60:40 నిష్పత్తిని తీసుకురావడాన్ని ఆయన వ్యతిరేకించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు, మెడికల్ కిట్ వంటి కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. పనిచేసిన కూలీలకు పే స్లిప్పులు ఇవ్వకుండా వేతనాలు సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, నాయకులు కంబాలపల్లి ఆనంద్, సుకన్య, ఉడుగుండ్ల రాములు, మన్నె భిక్షం, గండమల్ల రాములు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>