కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు నల్లగొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు (Nalgonda Court) కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు (యాదవ్), డిండి మండలానికి చెందిన ఒక ఎస్సీ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. యువతి పెళ్లి చేసుకోమని కోరగా, నక్క పర్వతాలు మరియు అతని అత్త నీలం సత్తమ్మ కలిసి ఆమెను కులం పేరుతో దూషిస్తూ నిరాకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిండి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో నిందితులు అదనంగా రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయి.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. నరసింహ, అప్పటి దర్యాప్తు అధికారి డీఎస్పీ కె. మనోహర్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అప్పటి ఎస్సై ఎం. రామాంజనేయులు, కోర్టు డ్యూటీ నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ కె. కృష్ణన్, కానిస్టేబుల్ పి. లింగయ్యలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా శాస్త్రీయ ఆధారాలను కోర్టుకు సమర్పించడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత డిండి ఎస్హెచ్ఓ బాలకృష్ణ, సిఐ బీసన్న, దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాస్ బృందాన్ని ఎస్పీ ప్రశంసించారు.

