కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పిల్లల సృజనాత్మకత, విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరాలు–2026’ (Summer Science Camps – 2026) పై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆనందం వ్యక్తం చేశారు. మంగళగిరి పబ్లిక్ లైబ్రరీలో ఈ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘పిల్లలు కేవలం చదవడమే కాదు.. ప్రపంచాన్ని అన్వేషించాలి, ఊహించాలి, సృష్టించాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి’ అని లోకేశ్ పేర్కొన్నారు. పిల్లలు చదవడం, ఆలోచించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, సృజనాత్మకతను వెలికితీయడం కోసం మంగళగిరి పబ్లిక్ లైబ్రరీని అందంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
గ్రంథాలయాల నుంచి ట్రెక్కింగ్ ట్రైల్స్ వరకు.. కళాత్మకత నుంచి ఆత్మవిశ్వాసం వరకు ప్రతి అంశంలో పిల్లలను ప్రోత్సహించేలా ఈ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. పిల్లలలో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకు, ఆసక్తిని రేకెత్తించేందుకు ప్రముఖ కార్టూనిస్ట్, ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ ప్రత్యేక సెషన్‌లు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ‘చదువు నుంచి ప్రపంచానికి.. పుస్తకాలతో భవిష్యత్తుకు’ అనే భావనతో ఈ కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

