కలం, వెబ్‌డెస్క్: అరుదైన జన్యుపరమైన వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులను కాపాడుకునేందుకు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ పునర్విక (Project Punarvika) పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ మేరకు నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఇటీవల రూ.16 కోట్ల ఇంజెక్షన్ పొందిన 11 నెలల చిన్నారి పునర్వికను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం ఒక బిడ్డ కోసమే కాకుండా దేశ వ్యాప్తంగా ఇలాంటి అరుదైన వ్యాధులకు ఖరీదైన వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అరుదైన వ్యాధుల పాలసీని బలోపేతం చేయనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలతో చర్చించి మందుల ధరలు తగ్గించడం, స్వదేశీ ఫార్మా సంస్థల సహకారంతో తక్కువ ధరకే చికిత్స అందించే మార్గాలను అన్వేషించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఏ ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోవద్దని మంత్రి స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులపై పోరాడే ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

