కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, యువజన సర్వీసుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఒక కోవా బన్ను వ్యాపారికి అండగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు సమాజంలో విభజన రాజకీయాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కోవా బన్ను అమ్ముకునే వలీ అనే వ్యాపారికి ఎదురైన చేదు అనుభవంపై మంత్రి లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘డియర్ బ్రదర్ వలీ, మీకు జరిగిన ఘటన పట్ల నేను విచారిస్తున్నాను. మన తెలుగు సమాజం ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇలాంటి మతపరమైన విభజన ధోరణులకు ఇక్కడ చోటు లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
‘నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గర ఫేమస్ కోవా బన్ను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను’ అని లోకేశ్ (Nara Lokesh) తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. లోకేశ్ స్పందన పట్ల పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


