పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: నల్గొండ ఎస్పీ

కలం, నల్గొండ : జిల్లాలో పెండింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ (Nalgonda SP) అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరును, కేసుల దర్యాప్తు పురోగతిని సమగ్రంగా సమీక్షించిన ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.కేసుల దర్యాప్తును మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ‘ఈ-సాక్ష్య’ యాప్‌ను ప్రతి దర్యాప్తు అధికారి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. కేసు దర్యాప్తులో భవిష్యత్తులో ఎలాంటి సందేహాలకు తావులేకుండా ఆధారాలను  భద్రపరచడంతో పాటు, కోర్టులో నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు ప్రక్రియను శాస్త్రీయ ఆధారాలతో బలోపేతం చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, కేసుల వివరాల నమోదు, దర్యాప్తు పురోగతి, CCTNS, e-Sakshya వంటి సాంకేతిక వ్యవస్థల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు.నేరాల నియంత్రణతో పాటు ముందస్తు నేర నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, స్థానికంగా సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలను గుర్తించడం, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నందున పట్టణాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, ముఖ్యమైన రహదారుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సరిచేయించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. మాదకద్రవ్యాల సరఫరా గొలుసును గుర్తించి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

అక్రమ రవాణా, ఇసుక అక్రమ మైనింగ్, పీడీఎస్ బియ్యం, అలాగే ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ తరలింపులు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుకూలంగా విని, చట్టపరమైన పరిధిలో సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ సూచించారు. బాధితుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా స్పందించాలని, ప్రజలకు న్యాయం అందించే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంపు వంటి అంశాలపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాం రెడ్డి, శ్రీనివాస్ రావు, లక్ష్మి నారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>