కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: నగరంలోని న్యూ ప్రేమ్‌నగర్‌లో అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నప్రసాద క్షేత్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల కాలం పాటు ఎంతో నిష్ఠతో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించేందుకు నిర్మించిన ఈ క్షేత్రంలో తనను భాగస్వామిని చేసినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు. ఇది భగవంతుడు తనకు కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కార్తీక మాసంలో దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు ఈ నిత్య అన్నప్రసాద క్షేత్రం వలన మేలు జరుగుతుందని అన్నారు. అన్నప్రసాద క్షేత్రానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఈ క్షేత్రం ద్వారా దీక్షలో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ నిరంతరం అన్నప్రసాదం అందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు నారాయణ గురుస్వామి మాట్లాడుతూ.. అయ్యప్ప అన్నప్రసాద క్షేత్రం నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షేత్రంలో నిత్యం సుమారు 500 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వంటగది (కిచెన్), మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, కార్పొరేటర్లు ప్రశాంత్, శ్రీనివాస్ రాజు, గోవర్ధన్ గౌడ్, రమేష్ రెడ్డి, క్షేత్ర నిర్వాహకులు శశిధర్ రెడ్డి గురుస్వామి, మనోహర్ గురుస్వామి, నాయకులు సంజీవ్ కుమార్ రెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

