కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం.. ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ విజయం.. ప్రపంచకప్‌లో ఐదో స్థానం. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల హాకీ జట్టు (Womens Hockey Team) మరో సవాలుకు సిద్ధమైంది. భోపాల్ వేదికగా జరగనున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జట్టు సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని కెప్టెన్ సలీమా టేటె తెలిపింది. ప్రతి టోర్నీలో తమ ఆటతీరును మెరుగుపరుచుకుంటూ వచ్చామని సలీమా పేర్కొంది. ఇదే జోరును కొనసాగిస్తూ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి టోర్నీ కావడంతో జట్టులోని ఐక్యత, పరస్పర నమ్మకంతో ఆడాలని భావిస్తున్నట్లు చెప్పింది.
ఆటపైనే దృష్టి పెట్టాం..
చైనాతో సహా ప్రత్యర్థి జట్లపై కాకుండా తమ ఆటపైనే దృష్టి పెట్టామని సలీమా స్పష్టం చేసింది. కోచ్ సూచనలు పాటిస్తూ, తమ ఆటతీరును కొనసాగించడమే లక్ష్యమని తెలిపింది. అవసరాన్ని బట్టి ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో ఆడేలా జట్టును సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. అనుభవజ్ఞురాలైన గోల్‌కీపర్ సవితకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఆమె స్థానంలో బన్సారీ సోలంకి జట్టులోకి వచ్చారు. బిచు దేవి కూడా గోల్‌కీపర్‌గా అందుబాటులో ఉన్నారు. ఇద్దరిపైనా జట్టుకు నమ్మకం ఉందని సలీమా తెలిపింది. భోపాల్‌లో తొలిసారిగా అంతర్జాతీయ హాకీ టోర్నీ జరగనుండటంపై జట్టు ఉత్సాహంగా ఉందని కెప్టెన్ పేర్కొంది. సొంతగడ్డపై అభిమానుల మధ్య ఆడటం ప్రత్యేక అనుభూతినిస్తుందని తెలిపింది.

