కలం, ఖమ్మం బ్యూరో: బొగ్గు గనుల నేలపై విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ఏళ్ల నాటి కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. సుజాతనగర్ (Sujathanagar) మండల పరిధిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ సానుకూలత తెలిపింది. సుజాతనగర్ వద్ద 667 ఎకరాల స్థలాన్ని ఖరారు చేస్తూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందించింది. ఈ ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఏఏఐ బృందం గతంలో విస్తృతంగా అధ్యయనం చేసింది. పెనగడప, పాల్వంచ–దుమ్ముగూడెం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాల్లో భూమి లభ్యత, వాతావరణ పరిస్థితులు, వరద ముంపు అవకాశాలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. అనంతరం అన్ని విధాలా అనుకూలంగా ఉన్న సుజాతనగర్లో 667 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తూ కేంద్రానికి సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించింది.
గరీబ్‌పేట, సుజాతనగర్ ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధిస్తూ ఏఏఐ అధ్యయన కమిటీ పర్యటన, సానుకూల నివేదిక కోసం కృషి చేశారు.
సుజాతనగర్లో ఎంపిక చేసిన స్థలం రవాణా పరంగా కూడా అనుకూలంగా ఉంది. ప్రధాన రహదారికి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు 5.7 కిలోమీటర్లు, భద్రాచలం పుణ్యక్షేత్రానికి 35.4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక, ఉపాధి రంగాలకు ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో త్వరలో భూసేకరణ, తదుపరి పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు ముందడుగు వేయడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును అభినందిస్తున్నారు.

