కలం, నల్లగొండ బ్యూరో: మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీసులు మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటుతూ సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను కేతేపల్లి పోలీసులు ఛేదించారు. ఈ దాడుల్లో సుమారు రూ.52.5 లక్షల విలువైన 104.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం కేతేపల్లి పోలీసులు కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ దిశగా భారీగా గంజాయి తరలుతున్నట్లు ఎస్‌ఐ సతీశ్‌కి అందిన ముందస్తు సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి మాటువేశారు.
ఉదయం 9:30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని (HP-38-F-3447) అడ్డుకున్నారు. అప్పటికే ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. లారీ వెనుక భాగాన్ని తనిఖీ చేయగా, నాలుగు పెద్ద ప్లాస్టిక్ బస్తాల్లో బ్రౌన్ కలర్ టేప్‌తో ప్యాక్ చేసిన 103 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒక్కో ప్యాకెట్ కిలో బరువుతో మొత్తం 104.5 కేజీల గంజాయి ఉన్నట్లు క్లూస్ టీమ్ నిర్ధారించింది. వీటితోపాటు లారీని, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ పరంవిర్ సింగ్ అలియాస్ లంబు (42), ముంబై ప్రాంతానికి చెందిన షా అలం పర్వేశ్ ఆలం అన్సారీ (37)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముఠా ప్రధాన సూత్రధారులు బిక్రం సింగ్ (జమ్మూ), ఫరూక్ అలియాస్ రాజు భాయి (ముంబై), భావు అలియాస్ కేదర్ ప్రధాన్ (ఒడిశా)ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఒడిశా అడవుల నుంచి ముంబైకి
విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజం జిల్లా భిష్మగిరి అడవుల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, ముంబైకి తరలించి భారీ లాభాలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుడు పరంవిర్ సింగ్‌కు గతంలో రెండు ట్రిప్పులకు రూ. 50 వేల చొప్పున చెల్లించారని, ఈసారి భారీ లోడ్ కావడంతో రూ. లక్ష ఇస్తామని ఆశ చూపినట్లు తేలింది. ‘మాదకద్రవ్యాలు యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను మూలాలతో సహా అరికడతాం’ అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి ఎస్‌ఐ సతీశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

