కలం, నల్లగొండ: వారం రోజుల క్రితం నల్లగొండ (Nalgonda) పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు అస్లం, తబస్సుమ్‌లపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం 29వ డివిజన్ ఏఐఎంఐఎం కార్పొరేటర్ మొహమ్మద్ నదీమ్, సుల్తాన్‌లతో కలిసి మృతుడి కుటుంబ సభ్యులు నల్లగొండ (Nalgonda) డీఎస్పీ శివరాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సమాజంలో తీవ్ర భయాందోళనలు సృష్టించిన నిందితులు అస్లం, తబస్సుమ్‌లపై తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఈ కేసు విచారణను వేగవంతం చేయాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని, ఈ ఘాతుకం వెనుక ఉన్న అన్ని కోణాలపై లోతైన, దర్యాప్తు నిర్వహించాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తును కొనసాగిస్తున్నారని భరోసా ఇచ్చారు. పక్కా చట్టపరమైన ఆధారాలను సేకరించి, నిందితులకు కోర్టు ద్వారా కఠినమైన శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ తమకు హామీ ఇచ్చినట్లు మృతుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.

