కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో రాజకీయ పార్టీలకతీతంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్ బుర్రి చైతన్య (Mayor Burri Chaitanya) తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డు వైయస్సార్ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు చేపట్టనున్న ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు.
మంత్రి కోమటి రెడ్డి చొరవతో సాగర్ రోడ్డు విస్తరణ పనులు: మేయర్
ఈ సందర్భంగా మేయర్ చైతన్య మాట్లాడుతూ.. సాగర్ రోడ్డులో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గుర్తించి ఇటీవల పరిశీలించామని, వెంటనే డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి ఆరులైన్ల రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. నల్లగొండ నగరంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, పానగల్ నుంచి డీఈఓ ఆఫీస్ వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోతున్నామని తెలిపారు.
స్మార్ట్ సిటీగా మార్చడమే లక్ష్యం..
నల్లగొండను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మేయర్ పేర్కొన్నారు. ఇటీవల చారిత్రాత్మక పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి రూ. 20 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. అలాగే పట్టణంలోని బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలకు ఘాట్ రోడ్లు నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను ‘స్మార్ట్ సిటీ’గా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రికి పాలకవర్గం, పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు గుండబోయిన వెంకన్న యాదవ్, మామిడి కార్తీక్, రేగట్ట లింగస్వామి గౌడ్, ఇటికాల శ్రీనివాస్, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, వజ్జ రమేష్ యాదవ్, ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య, దీప్లా నాయక్, పిల్లి కృష్ణంరాజు, సట్టు శంకర్, జూలకంటి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

