రైతులకు 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు.. ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు 100 శాతం (100 Percent Subsidy) సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను (Groundnut Seeds) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 700 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పూర్తి ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ఈసారి ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని (MLA Balu Naik) స్పష్టం చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో పండే వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 90 తాగు, సాగునీటి బోర్లు ఎండిపోయాయని, వీటిలో అత్యధికంగా ఉమ్మడి చందంపేట మండల పరిధిలోనే ఉండడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులు అందుబాటులో ఉన్న నీటిని అంచనా వేసుకొని, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకొని ఆర్థిక నష్టాల నుంచి కాపాడుకోవాలని సూచించారు. దేవరకొండ ప్రాంత రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

అందులో భాగంగా త్వరలోనే ఏదుల నుంచి డిండి ప్రాజెక్టులోకి నీటిని తీసుకొచ్చేలా చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, పంటల కొనుగోలు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజా ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు దొండేటి మల్లారెడ్డి, ఏడుపుల గోవింద్ యాదవ్, మేకల రాజేందర్ రెడ్డి, కిన్నెర హరికృష్ణ, వాంకునావత్ పాపా నాయక్, కేతావత్ భరత్, జక్కుల మున్నయ్య యాదవ్, కొప్పుల సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>