కలం, వెబ్ డెస్క్ : మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్, ఆయన అనుచరులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి రూ. 50వేల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు యత్నించారని ఆరోపించారు.
అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూకబ్జా యత్నాలపై తీవ్రంగా పోరాటం చేశామని, నాటి ప్రభుత్వం కోర్టుల్లో సరైన వాదనలు వినిపించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మియాపూర్ భూముల (Miyapur Lands) విషయంలో సుప్రీంకోర్టులో అత్యంత బలమైన ఆధారాలతో వాదనలు వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని న్యాయపోరాటం చేయడంతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చివరి వరకు పోరాడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు మియాపూర్ లో 550 ఎకరాల భూములను రెండ్రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తక్షణమే ఈ భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే ఈ భూములను అమ్మి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని.. పేదల ప్రయోజనానికి ఈ భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను వెచ్చిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కబ్జాకోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని పేర్కొన్నారు.
ఐఎంజీ భూముల అంశంలోనూ కోర్టులో బలంగా వాదనలు వినిపించామని, దీనిపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. మంచిరేవులలోని 143 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నించారని, అయితే ఈ అంశంపైనా కోర్టులో కొట్లాడి భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇందులో 50 ఎకరాలు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు కేటాయించినట్లు వివరించారు.
కాగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల అత్యంత విలువైన భూమిపై ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించగా, రెవెన్యూ రికార్డులు లేదా పహాణీలలో పేర్లు నమోదైనంత మాత్రాన యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది.
Also Read : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పాదయాత్ర ఆగదు: ఈటల రాజేందర్
Follow Us On : WhatsApp

