కలం, వెబ్ డెస్క్ : హరీష్ రావును కాళేశ్వరం గేట్లకు కట్టేసి కొట్టాలని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ (Eravathri Anil) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో అనిల్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ధనదాహం వల్లే కాళేశ్వరానికి ఈ దుస్థితి పట్టిందని, ఆయనను గోల్కొండ కోటకు కట్టి ఉరేసినా తప్పులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సభ్యుడు సమీర్ కుమార్ శుక్లే మేడిగడ్డపై స్పష్టమైన నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. టెక్నికల్ కమిటీ మొదట స్టిల్లింగ్ బేస్ మరమ్మతులు చేయాలని భావించినప్పటికీ, ప్రాజెక్టే నాణ్యతా లోపాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు అధ్యయనంలో తేలిందని తెలిపారు. బ్యారేజీలు కట్టాల్సిన చోట కాకుండా వేరే చోట, శాస్త్రీయ నిబంధనలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టినట్లు ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం గేట్లు మూసివేయొద్దని చెబుతుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎన్‌డీఎస్‌ఏ కంటే బీఆర్ఎస్ నేతలే గొప్ప మేధావులా అని అనిల్ ప్రశ్నించారు.
కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ తెచ్చిన కరువేనని, వారి చేసిన తప్పులకు సీఎం రేవంత్ రెడ్డిని బాధ్యులను చేయడం తగదని ఇరవత్రి అనిల్ స్పష్టం చేశారు.

