కలం, ఖమ్మం బ్యూరో: ఏదులాపురం మున్సిపాలిటీని (Edulapuram Municipality) రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చు చేయగా.. రాబోయే రోజుల్లో మరో రూ. 100 నుంచి రూ. 150 కోట్లు వెచ్చించి ప్రతి డొంకను, ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 6వ వార్డు సింగరేణి కాలనీ వద్ద రూ. 4.96 కోట్ల అంచనా వ్యయంతో 46 అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణానికి, రూ. 2.50 కోట్ల వ్యయంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జి నుంచి కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోటనారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమిపూజ చేశారు.
ఈ నూతన రోడ్ల ద్వారా సాయి ప్రభాత్ నగర్, టెంపుల్ సిటీ, అభయ టౌన్షిప్, సింగరేణి కాలనీ, గుర్రాలపాడు తండా, ఇందిరమ్మ కాలనీ, సూర్యానగర్, చంద్రనగర్, కె.ఎల్.ఆర్. నగర్, బృందావనం, గోకుల కృష్ణ నగర్, తాశిల్లీ తండా, లక్ష్మీ గాయత్రి నగర్, నందనవనం, ఆదిత్య టౌన్షిప్, శ్రీవారి నగర్, సత్య సంకల్ప కాలనీ, షాబాద్ మాసరెడ్డి నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6, 7, 8 డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 79.79 కోట్లతో శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏదులాపురం అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ. 100 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. 8 నుంచి 11 గ్రామ పంచాయతీలు విలీనమైన ఈ విశాలమైన మున్సిపాలిటీని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్పారు.
కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాకుండా తాగునీరు, విద్యుత్ సమస్యలతో పాటు హైటెన్షన్ లైన్ల తొలగింపు వంటి సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గడిచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు.
అలాగే పేదవాడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనే కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాదులో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 8 లక్షల ఇళ్ల కోసం రూ. 40 వేల కోట్లు కేటాయించామని, కులం, మతం, పార్టీలకతీతంగా కేవలం పేదరికం ప్రాతిపదికనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏదులాపురం మున్సిపాలిటీలో రూ. 30 కోట్ల విలువైన శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా సమగ్ర అభివృద్ధి జరుగుతోందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు పనుల వేగవంతం కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అధికారులను డిెప్యుటేషన్పై రప్పించామని, త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

