Mobile Popup Ad
Mobile Popup Ad

వీడిన నల్లగొండ ఫ్యామిలీ మర్డర్ మిస్టరీ.. యూట్యూబ్‌ వీడియో చూసి స్కెచ్

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ పట్టణాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య కేసు (Nalgonda Murder Case) మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అక్క కూతురు, అల్లుడు వారి స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు.

ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నిందితుల నుంచి మహీంద్రా మరాజో కారు, రూ.3 లక్షల నగదు, 5 తులాల కరిగించిన బంగారు ముద్ద, హత్యకు ఉపయోగించిన జమ్మి కత్తి, రక్తపు మరకల బట్టలు, 3 సెల్ ఫోన్లు, ల్యాండ్, బ్యాంక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డు, తెలంగాణ కాలనీలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఒక ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లోపలికి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ప్రైవేట్ టీచర్ హసీనా, ఆమె భర్త సుల్తాన్ (45), సుల్తాన్ పిల్లలు ముజమ్మిల్ (20), అఫ్కూరా (12)లుగా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్.. కేసు దర్యాప్తు కోసం డీఎస్పీ కె. శివరాం రెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, సీసీఎస్ సిబ్బందితో కలిపి మొత్తం 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1 సయ్యద్ అస్లాం (28), ఏ2 తబస్సుం (28), ఏ3 మహమ్మద్ సోహైల్ (26), ఏ4 హేమంత్ కుమార్ (28) నిందితులుగా ఉన్నారు.

హత్యకు దారితీసిన కారణాలు ఇవే..

పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన నిజాలు సినిమా స్క్రిప్ట్‌ను తలపించాయి. 2013లో హసీనా మొదటి భర్త పెట్టిన కేసు వల్ల తబస్సుం (ఏ2) తల్లి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై హసీనా కుటుంబంపై పాత కక్ష ఉంది. దానికి తోడు జల్సాలకు అలవాటు పడి అప్పుల్లో మునిగిపోయిన అస్లాం (ఏ1).. ఇటీవలే గర్భవతి అయిన తన భార్య ఖర్చుల కోసం, కొత్త కారు కోసం హసీనాను మరో లక్ష రూపాయల అప్పు అడిగాడు. దానికి హసీనా నిరాకరిస్తూ పాత బాకీ తీర్చాలంటూ అవమానకరంగా మాట్లాడింది.

హసీనా కూతురు బుష్రాను అస్లాం దంపతులు సంప్రదించగా.. తన తల్లి ఇంట్లో చాలా డబ్బు, బంగారం దాచిందని, అంతా సుల్తాన్ పిల్లలకే పెడుతోందని చెప్పింది. ఎలాగైనా హసీనాను అంతమొందించి డబ్బలు పొందాలని భార్యాభర్తలు ప్లాన్ చేశారు. హత్య ఎలా చేయాలి? దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి? అనే విషయాలపై అస్లాం యూట్యూబ్‌లో వీడియోలు చూసి పక్కా స్కెచ్ వేశాడు.

అర్ధరాత్రి వేట.. ఆపై మారణహోమం..

పథకం ప్రకారం జూన్ 19న అస్లాం తన మరాజో కారులో జమ్మి కత్తితో నల్లగొండకు వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాంపౌండ్ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 5 గంటలకు హసీనా తలుపు తీసి బయటకు రాగానే మెడపై కత్తితో నరికి చంపాడు. కేకలు విని వస్తున్న భర్త సుల్తాన్‌ను కూడా నరికేశాడు.

ఆ గొడవకు నిద్రలేచి ఐరన్ రాడ్‌తో ఎదురుతిరిగిన ముజమ్మిల్ (20)ను తీవ్ర పెనుగులాట తర్వాత హతమార్చాడు. చివరగా, బెడ్‌రూమ్‌లో మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల చిన్నారి అఫ్కూరా తనను గుర్తుపడుతుందని, సాక్ష్యం ఉంచకూడదనే క్రూరత్వంతో ఆమెను బయటకు లాగి గొంతు కోసి చంపేశాడు. నలుగురిని చంపిన అనంతరం బీరువాలోని 5 తులాల బంగారం, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను దొంగిలించి, శవాలపై చాపలు కప్పి, బయట తాళం వేసి హైదరాబాద్ పారిపోయాడు.

ఆ సొత్తును దిల్ సుఖ్ నగర్‌లోని బాలాజీ జ్యువెలరీలో రూ.5.30 లక్షలకు తాకట్టు పెట్టాడు. అత్యంత క్లిష్టమైన ఈ హత్యాకాండను కేవలం 3 రోజుల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్న నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ. రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>