కలం, శాలిగౌరారం : రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy), తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు శుక్రవారం శాలిగౌరారం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా రైతాంగానికి సాగునీరు విడుదల చేయడంతో పాటు, పార్టీ బలోపేతం కోసం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగానికి అండగా నిలుస్తూ, శాలిగౌరారం చెరువు నుంచి పంట పొలాలకు ప్రజాప్రతినిధులు అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. ముందుగా ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల వద్ద ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు ప్రత్యేక పూజలు నిర్వహించి, బటన్ నొక్కి నీటిని కిందికి వదిలారు.
ఈ నిర్ణయంతో శాలిగౌరారం పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువు నీరు వృథా కాకుండా చూడటంతో పాటు, కాలువల ద్వారా చిట్టచివరి ఆయకట్టు రైతుకు కూడా నీరందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికల నిర్వహణలో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని ఎంపీ చామల గుర్తుచేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రతి ఏజెంట్ అత్యంత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

