Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండపై ఇంధన ధరల ప్రభావం.. నెలకు రూ.20 కోట్ల భారం

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్ డిగ్రీ చదివినా సరైన ఉద్యోగం దొరకకా 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య ఇంటిపనులు చేస్తూ తోడ్పాటుగా ఉండగా, ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూలులో  చదువుతున్నారు. కరోనా ముందు వరకు కాస్త స్థిరంగా సాగిన జీవితం, కరోనా తర్వాత పూర్తిగా దెబ్బతింది. తాజాగా అమలైన ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల మహిళలు ఎక్కువగా బస్సులలో ప్రయాణించడం, అలాగే పెట్రోల్, డీజిల్ ధరల (Fuel Price) పెరుగుదలతో ఆటోకి గిరాకీ తగ్గి జీవనం మరింత కష్టమైంది. నెలవారీ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చి, చివరకు ఆటోను అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని శివశంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఒక్క శివశంకర్‌దే కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇలా వేలాది ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఉపాధి తగ్గడం, మరోవైపు ఇంధన ధరలు పెరగడం కలిసి వారి బతుకును మరింత భారంగా మార్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరగడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభాన్ని కారణంగా చూపుతూ చమురు సంస్థలు చేసిన ఈ పెంపు జిల్లా ప్రజల జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. రోజుకు సుమారు 16.10 లక్షల లీటర్ల డీజిల్, 5.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం ఉన్న ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాపై ఈ పెంపుతో రోజుకు సుమారు రూ. 66 లక్షల అదనపు భారం పడుతోంది. దీంతో నెలకు దాదాపు రూ. 20 కోట్ల వరకు అదనపు వ్యయం సామాన్యుల జేబుపై పడనుంది. ఈ ధరల పెంపుతో అత్యధికంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం కారణంగా కిరాయిలు తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి డీజిల్ ధరల పెంపు మరింత భారంగా మారింది.

రోజంతా పని చేసినా కనీస ఆదాయం కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంపైనా ఈ ప్రభావం పడనుంది. ట్రాక్టర్‌లు, మోటార్ల వినియోగ ఖర్చులు పెరగడంతో రైతుల పెట్టుబడి భారంగా మారనుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాల వంటగది బడ్జెట్ ఇప్పటికే ఒత్తిడిలో ఉండగా, తాజా పెంపుతో పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల తగ్గింపు ద్వారా ఇంధన ధరలను నియంత్రించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

Read Also: తిట్టినా ప‌ట్టించుకోను.. ఆక్ర‌మ‌ణ‌లు తొలగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>