కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. రాజకీయాల్లో 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను గమనించిన అంశాలే నేటి తెలంగాణ రైజింగ్ పాలసీకి మూలమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో 51 శాతం మద్దతు ఉంటే గెలుస్తామని నమ్ముతానని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అసహనం లేకపోవడం వల్లే ఎనర్జీగా ఉంటానని చెప్పారు. గ్రామస్థాయి నుంచి సినీ, పారిశ్రామిక రంగాల వరకు అన్నింటిని చూసిన తనకు సమస్యలు వచ్చినప్పుడు మానసిక ఒత్తిడి కలగడం సహజమని అభిప్రాయపడ్డారు.
భీమవరంలో కొత్త అల్లుడికి పెట్టే వందల వంటకాల విందులాగే సంక్షేమం కూడా నిరంతర ప్రక్రియ అని, అయితే అభివృద్ధి మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరగాలని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే 108 దేశాల ప్రతినిధులతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పారిశ్రామిక పాలసీని రూపొందించామని, ఫ్యూచర్ సిటీని మచిలీపట్నం వరకు రవాణా సౌకర్యంతో అనుసంధానిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక, విద్యా వ్యవస్థలపై స్పందిస్తూ ఆర్టీసీకి నెలకు రూ.350 కోట్లు ఇస్తూ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చామని సీఎం అన్నారు. నగరాల్లో 2,554 బస్సులతో పాటు ఈవీ బస్సులను ప్రవేశపెట్టి డీజిల్ ఖర్చును తగ్గిస్తున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ (NITI Aayog) నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వ బడుల్లో సున్నా డ్రాప్ అవుట్స్ ఉండటం గవర్వకారణమని చెప్పారు. మహిళా సంక్షేమం కోసం 28 నెలల్లో రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కులాలవారీగా స్కూళ్లు కట్టి అంటరాని తనాన్ని ప్రోత్సహించారని సీఎం విమర్శించారు. ఇప్పుడు అందరూ కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.
నగర అభివృద్ది, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తేల్చి చెప్పారు. యుద్ధం జరిగినప్పుడు కొంత మంది అమాయకులుచనినపోతారని, అలాగే ఆక్రమణలు తొలగింపులో కూడా ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసేది సమాజం కోసమే తప్ప తన స్వార్థం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగిస్తే కొందరు తిడుతున్నారని, తిట్టినా పట్టించుకోనని సీఎం తెలిపారు. బాధితులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నా వినడం లేదని అన్నారు. డ్రగ్స్ , సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. పండుగలు చిచ్చుబుడ్లతో జరుపుకోవాలని, డ్రగ్స్‌తో కాదని ఎద్దేవా చేశారు.
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికిన వారు తనను తిడితే ఎలా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా అనుకున్న స్థాయిలో లేదని సీఎం అన్నారు. తన భవిష్యత్తును డిసైడ్ చేసేది బీఆర్ఎస్ నేతలు కాదని, ప్రజలేనని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఒక కేసు విషయంలో రాహుల్ గాంధీ స్వయంగా తనకు మెసేజ్ చేశారని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో తాను సాధించిన విజయాలపై వంద శాతం సంతృప్తితో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: ఎన్నికలు ముగిశాయి, బాదుడు మొదలైంది.. బీజేపీపై శ్రీధర్ బాబు ఫైర్
Follow Us On : WhatsApp

