కలం, భువనగిరి : భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. రూ. 210 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు తాగునీటిని తరలించే పైప్‌లైన్ నిర్మాణ పనులను మంగళవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం ఘనపూర్ గుట్ట వద్ద వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించి అటవీ ప్రాంతంలో అవసరమైన 4.5 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రజాప్రతినిధులు తెలిపారు. మిగిలిన పనులను సైతం అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం భువనగిరి, ఆలేరు ప్రాంతాల ప్రజల తాగునీటి సమస్యలను పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యేలు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా అవసరాలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ రూ. 210 కోట్లతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంజూరు చేసి వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. మల్లన్నసాగర్ నీటి తరలింపుతో రెండు నియోజకవర్గాల్లోని వేలాది కుటుంబాల దాహార్తి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీషా-కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ సీఈ రాంచంద్రనాయక్, ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

