కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఓవర్ హెడ్ ట్యాంకులు, రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం, బోర్ల తవ్వకం పనుల పురోగతిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
అనంతరం ఆయన (Kunamneni) మాట్లాడుతూ.. ప్రజల తాగునీటి అవసరాల కోసం నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం క్షేత్రస్థాయిలో విఫలమైందని, పనుల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఆయన నిలదీశారు. నీటి సమస్య పరిష్కారం కోసం తాను అందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు అల్లాడకుండా నిరంతరం నీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అయితే ఉన్న వనరులతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అధికారులు తిరుమలేశ్, శివయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Also: నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్
Follow Us On: X(Twitter)

