నల్లగొండ కార్పొరేషన్‌.. సామాన్యుల‌పై ప్రతాపం.. బడాబాబులకు సలాం..!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ (Nalgonda Corporation)లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 గడువు ముంచుకొస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ లెక్కలు తేలాల్సిన సమయం దగ్గరపడింది. కానీ, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల తీరు చూస్తుంటే అధికారులు కుంభకర్ణ నిద్రలో ఉన్నారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు రోజులే గడువు ఉన్నా.. నగరంలో సగం పన్ను కూడా వసూలు చేయలేకపోయిన యంత్రాంగం.. ఇప్పుడు ఆ నెపాన్ని సామాన్యుల మీద నెట్టేస్తూ బస్తీల్లో హల్‌చల్ చేస్తోంది. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, చిన్నపాటి ఇళ్లలో ఉండే వారి వద్దకు వెళ్తున్న సిబ్బంది.. ‘పన్ను కట్టకపోతే ఇంటికి తాళాలు వేస్తాం.. సామాన్లు జప్తు చేస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఒక్క రోజు గడువు ఇవ్వడానికి కూడా ససేమిరా అంటున్నారు. అదే నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు వంటి ప్రధాన కూడళ్లలో ఉన్న భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ ఏళ్ల తరబడి పన్నులు ఎగ్గొడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకవేళ వెళ్లినా.. రాజకీయ పలుకుబడి ఉన్న వారి ముందు “సార్.. ప్లీజ్ కట్టండి” అంటూ ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది.

పెండింగ్‌లో రూ.28 కోట్లు బకాయి

నల్లగొండ కార్పొరేషన్ (Nalgonda Corporation) పరిధిలో మొత్తం 43,567 అసెస్ మెంట్లు ఉండగా, లక్ష్యం రూ.42.50 కోట్లు. అయితే ఇప్పటివరకు వసూలయ్యింది కేవలం రూ.13.75 కోట్లు (32.32శాతం) మాత్రమే. అంటే ఇంకా ఏకంగా రూ.28.76 కోట్లు బకాయి పడి ఉంది. గడువుకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా.. ఈ భారీ మొత్తాన్ని ఎలా వసూలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా మున్సిపాలిటీలో 70 నుంచి 90 శాతం వరకు ఆస్తి పన్ను వసూలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది 40 శాతం వసూలు చేసేందుకు ఆపసోపాలు పడుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. కమర్షియల్ కాంప్లెక్స్‌ల యజమానుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు లేదా వారి అనుచరులే కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.

నోటీసులు ఇవ్వడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వసూలు చేయాల్సిన రూ.28 కోట్లలో సింహభాగం ఈ బడాబాబులదే ఉన్నా.. వారిని వదిలేసి సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలనుకోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని చెప్పాలి. మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే విషయమై ప్రభుత్వం వడ్డీలో రాయితీ కల్పించామని చెబుతోంది. కానీ అది నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు కావడం లేదు. ఉత్తర్వులు రాలేవనే సాకుతో ఆస్తి పన్నుతో పాటు మొత్తం వడ్డీ వసూలు చేయడం గమనార్హం. ఇటీవల ఓ వినియోగదారుడు గత రెండు సంవత్సరాల బకాయి చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. వడ్డీ రాయితీ వస్తుందని భావిస్తే.. అసలు వడ్డీ కలిపి రూ.9 వేల పైచిలుకు కట్టించుకున్నారు. దీంతో ఆ సామాన్యుడు ఉసురుమంటూ అధికారులపై అసంతృప్తితో ఇంటిబాట పట్టాడు.

Read Also: ‘అందుకే మౌనికను హత్య చేశా’.. నిందితుడి షాకింగ్ కామెంట్స్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>