కలం, వెబ్ డెస్క్: మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు చెల్లూరి నారాయణ (Chelluri Narayana) ఏపీ డీజీపీ డీజీపీ హరీశ్ కుమార్ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన దాదాపు 36 సంవత్సరాలుగా పార్టీలో అజ్ఞాత జీవితంలో ఉన్నారు. ఎక్కువ కాలం శ్రీకాకుకళం, విజయనగరం జిల్లాల్లో పనిచేశాడు. ప్రస్తుతం నారాయణతో పాటు ఆయన నాయకత్వం వహిస్తున్న దళానికి చెందిన మరో 8 మంది సైతం లొంగిపోయారు. ఆయన పేరు మీద ఉన్న రూ. 25 లక్షల క్యాష్ రివార్డుతో పాటు మిగిలినవారందరికీ కలిపి రూ. 24.20 లక్షల నగదు రివార్డును గుప్తా అందజేశారు. ఏపీ ప్రభుత్వ పిలుపుతో ఇప్పటివరకు తొమ్మిది మంది సీనియర్ లీడర్లు లొంగిపోయారని డీజీపీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో సీనియర్ నాయకుడిగానే కాక కేంద్ర కమిటీలోనూ యాక్టివ్‌గా ఉన్న నారాయణ లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ యాక్టివిటీస్ దాదాపుగా అంతమైనట్లేనని డీజీపీ ప్రకటించారు.
మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ: డీజీపీ
ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ముమ్మరంగా ఉన్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు.. ఇప్పుడు దాదాపుగా క్లోజ్ అయ్యాయని డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం నగదు బహుమతితో పాటు పునరావాసానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బెనిఫిట్స్ మొత్తం వారికి అందజేస్తామని, పార్టీ ప్రస్తుత పరిస్థితులను గమనంలోకి తీసుకుని ఇక సాయుధ పోరాటం కుదరదనే అభిప్రాయంతో మనసు మార్చుకుని జన జీవన స్రవంతిలో కలవడం మంచి నిర్ణయమని నారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ తన సైద్ధాంతిక అవగాహనను అప్‌డేట్ చేసుకోలేదని, ఒక్కో రాష్ట్రంతో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు గణనీయంగ తగ్గిపోయి నామినల్ అయ్యాయని అన్నారు.
దళ సభ్యుడి నుంచి ఏఓబీ సెక్రటరీ వరకు:
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాకు చెందిన చెల్లూరి నారాయణ (Chelluri Narayana) అలియాస్ సురేశ్ 1990లో అదే జిల్లాలోని కొండబారిడి దళ సభ్యుడిగా నాలుగేండ్ల పాటు పనిచేసి 1994లో ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా స్పెషల్ గెరిల్లా దళాల బాధ్యతలు నిర్వహించి 2003లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2009లో మూడవ సీఆర్సీ కమాండర్2గా బాధ్యతలు చేపట్టి 2016లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జిగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ కమిటీ సెక్రటరీగా 2024 వరకు కొనసాగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా 2024లో పదోన్నతి పొంది ప్రస్తుతం ఆ బాధ్యతల్లోనే కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. నారాయణతో పాటు వివిధ బాధ్యతల్లో ఉన్న మరో ఏడుగురు, కొందరు దళ సభ్యులు మొత్తం 19 ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలిపారు.
Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?
Follow Us On : WhatsApp

