‘అందుకే మౌనికను హత్య చేశా’.. నిందితుడి షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖ‌ పట్నం (Visakhapatnam) గాజువాక ఎల్‌.వి.నగర్‌లో జరిగిన దారుణ ఘటన (Vizag Murder Case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని మీర్‌పేట పరిధిలో మహిళను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన షాక్‌కు గురి చేస్తోంది. ప్రియురాలిని ప్రియుడు దారుణంగా చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఆ భాగాలన్నింటిని ఒక కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భార్య ఇంట్లో లేని సమయంలో కైలాసపురానికి చెందిన వివాహితురాలు, ప్రియురాలు మౌనిక(29) ను నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న చింతాడ ర‌వీంద్ర‌ (35) ఇంటికి రమ్మని పిలిచాడు. ఇంటికి వచ్చిన యువతితో రవీంద్ర కాసేపు సరదాగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవ కావడంతో సదరు యువతిని ఘోరంగా చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ కేసులో (Vizag Murder Case) ప్రాథమిక విచారణలో సోమవారం పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో నిందితుడు చింతాడ రవీంద్ర (Chintada Ravindra)కు డేటింగ్‌ యాప్‌లో మౌనిక పరిచయమైనట్లు వివరించారు. మౌనిక (Mounika)తో తనకు 2020 నుంచి పరిచయం ఉందని తమకు రవీంద్ర చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే 2023లో తాము విడిపోయామని, ఆ తర్వాత ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కూడా జరిగిందని నిందితుడు చెప్పాడని వివరించారు. ఈ క్రమంలోనే మౌనికకు రూ.3.50 లక్షల ఇచ్చినట్లు రవీంద్ర చెప్పాడని పోలీసులు తెలిపారు. మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, ఆ వేధింపుల నుంచి తప్పించుకోవడానికే హతమార్చినట్లు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు. నిందితుడి భార్య గర్భవతి అని, ఆమె డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో సదరు యువతిని తన ఫ్లాట్ కు పిలిపించుకున్నాడని పోలీసులు తెలిపారు.

తల భాగాన్ని గుర్తించిన పోలీసులు..

యువతి కొన్ని శరీర భాగాలు మాత్రమే ఉన్నాయని.. తల, మిగితా భాగాలు ఎక్కడ? అని ప్రశ్నించడంతో వాటిని కాల్చి వేసినట్లు రవీంద్ర చెప్పినట్లు తెలుస్తోంది. సదరు యువతిని కత్తితో పొడిచి చంపిన తరువాత ఆనవాళ్లు లేకుండా చేయాలని రవీంద్ర అనుకున్నాడు. మొదలు మౌనిక మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికాడు. శరీరంలోని మొండెం భాగాన్ని తన ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి.. నడుము, కాళ్ల భాగాలను ఒక సూట్‌కేసులో కుక్కాడు. ఎవరూ గమనించకముందు తల, చేతులను ఒక మూటలో కట్టి దారపాలెం ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు. ఇంటికి వచ్చి రక్తాన్ని అంతా కడిగి వాసన రాకుండా సెంట్ కొట్టాడు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో దహనమైన తల భాగాన్ని గుర్తించారు. దీంతో ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమయినట్లు తెలుస్తోంది.

పోలీసుల స్టేట్ మెంట్:

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్‌.వి.నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మౌనికను రవీంద్ర పిలిచాడు. అక్కడికి వచ్చిన కాసేపటికే వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఆమెను రవీంద్ర కిరాతకంగా హతమార్చాడు. హత్యకు ముందే గాజువాకలో కత్తులు కొనుగోలు చేశాడు. మౌనికను కత్తితో పొడిచి చంపిన తర్వాత రక్తపు మరకలు కడిగేశాడు. రక్తపు వాసన రాకుండా ఇంట్లో సెంటు కొట్టాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. తల, ఆమె ఫోన్‌ను దారపాలెం తోటల్లో తగులబెట్టాడు. అనంతరం స్నేహితుడికి ఫోన్‌ చేసి హత్య విషయాన్ని చెప్పాడు. స్నేహితుడు హెచ్చరించడంతో గాజువాక పోలీసులకు రవీంద్ర లొంగిపోయాడు.

Read Also: తెలంగాణలో రోడ్లకు మహర్ధశ : అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>