కలం, నల్లగొండ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన, బహిరంగ సభ రాజకీయంగా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో.. అంతకంటే మిన్నగా అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను, గ్రూపు రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది. సభకు ముందు, సభ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా కాంగ్రెస్ (Nalgonda Congress) లో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరును ఒక్కసారిగా వీధిలోకి తెచ్చాయి. ఒకరిపై ఒకరు పంతాలు, నెగ్గింపుల పర్వంతో నల్లగొండ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలో పార్టీ అధికారిక కార్యక్రమాలను, సీఎం సభను దగ్గరుండి విజయవంతం చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిపై ఉంటుంది.
కానీ, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు ఈ పర్యటనలో అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గానికి, కైలాష్ నేతకు మధ్య ఉన్న తీవ్రమైన గ్యాప్ కారణంగా.. సభ కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనల్లో డీసీసీ అధ్యక్షుడి ఫోటోగానీ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోలుగానీ ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఒక దశలో కైలాష్ నేత సభకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది.
అయితే, వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన పంతం నెగ్గించుకున్న తరహాలో నేరుగా సీఎం సభా వేదికపై ప్రత్యక్షం కావడం విశేషం. బహిరంగ సభా వేదికపైకి రావడం ఒకెత్తయితే.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రసంగంలో పున్న కైలాష్ నేత పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనను తొక్కేయాలని చూసిన స్థానిక తన వ్యతిరేక వర్గానికి కైలాష్ నేత ఈ రకంగా చెక్ పెట్టారని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
కోమటిరెడ్డి అనుచరులకు షాక్.. వేదికపై సీఎంఓ సిబ్బంది బ్రేక్..
ఒకవైపు డీసీసీ అధ్యక్షుడు పంతం నెగ్గించుకుంటే.. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు, జిల్లా కేంద్రంలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నాయకులకు సీఎం భద్రతా సిబ్బంది నుంచి ఊహించని షాక్ తగిలింది. నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ (ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ భర్త) బుర్రి శ్రీనివాస్ రెడ్డి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, ప్రోటోకాల్, భద్రతా కారణాల దృష్ట్యా సీఎంఓ సిబ్బంది వారిని కఠినంగా అడ్డుకుని, పక్కకు నెట్టివేయడం సంచలనంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి అండతో జిల్లాను శాసిస్తున్న ఈ ఇద్దరు కీలక నేతలకు సీఎం వేదికపై చోటు దక్కకపోవడం, వారి వ్యతిరేక వర్గంలో పెద్ద ఎత్తున చర్చకు, హర్షానికి దారితీసింది.
సీఎం పర్యటనకు రాజగోపాల్ రెడ్డి దూరం
ఈ పర్యటనలో ముందే ఊహించిన అంశం.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, మిగతా ఎమ్మెల్యేలందరూ సీఎం సభలో సందడి చేయగా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారానికి, ఈ సభకు ఆయన దూరం కావడం మరింత బలాన్ని చేకూర్చింది.
సభకు ముందే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఆయన అనుచరులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు, రాజకీయ ఉత్కంఠకు కారణమైంది. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ రేంజ్‌లో సీట్లు సాధించినప్పటికీ.. అంతర్గతంగా నేతల మధ్య ఉన్న అహాలు, ఆధిపత్య పోరు సీఎం సభ ద్వారా మరోసారి బహిర్గతమయ్యాయి.
ఒకవైపు స్థానిక మంత్రుల హవా నడుస్తుండగా, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా డీసీసీ అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జిల్లా రాజకీయాలపై తనదైన పట్టును ప్రదర్శించే ప్రయత్నం చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, సీఎం సభ సక్సెస్ అయినప్పటికీ.. లీడర్ల మధ్య పెరిగిన ఈ గ్యాప్ రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌ను ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

